ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ స్కామ్ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి అనుమతి లభించింది. ఈ కేసుకు సంబంధించి ఈ దర్యాప్తు సంస్థ ఆయనపైన, ఆయన కుటుంబ సభ్యులపైన ఇదివరకే కేసు పెట్టింది. లాలూ ప్రసాద్ యాదవ్ లోగడ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా.. ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థుల నుంచి భూములు రాయించుకున్నారని, అదే క్రమంలో వారి నుంచి సొమ్ములు కూడా తీసుకుని అవినీతికి పాల్పడ్డారని సిబిఐ లోగడ ఆరోపించింది.
ఈ కుంభకోణంలో ఆయన కుటుంబ సభ్యుల పేర్లను కూడా ఎఫ్ ఐ ఆర్ లో చేర్చింది. సవరించిన అవినీతి వ్యతిరేక చట్టం కింద ఒక రాజకీయ నేతను ప్రాసిక్యూట్ చేయాలంటే ముందుగా సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు కేంద్రం ఇందుకు అనుమతి నిచ్చింది. గత ఏడాది ఆగస్టులో ఈ సంస్థ అధికారులు గురు గ్రామ్ లో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కి చెందిన మాల్ తో బాటు 27 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
ఇలాగే ఈ పార్టీకి చెందిన మరికొంతమంది నేతల ఇళ్ళు, కార్యాలయాలపై కూడా వారు రెయిడ్స్ చేసి.. 200 కి పైగా సేల్ డీడ్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక 2004-2009 మధ్య కాలంలో యూపీఏ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా ఉండగా లాలూ ప్రసాద్ యాదవ్, ల్యాండ్స్ ఫర్ జాబ్స్ స్కామ్ కి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు వచ్చాయి.
అయితే సుమారు నెల క్రితం సింగపూర్ లోని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ ని సీబీఐ ఎలా, ఎప్పుడు ప్రాసిక్యూట్ చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు ఆయన కుమార్తె తన కిడ్నీని ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.