మాది బాహుబలి సినిమా అని వాళ్లు చెప్పుకుంటున్నారు. మరొకరిది వినయ విధేయ రామా అని చెప్పుకుని బోర్లా పడ్డారు. అందుకే ఆ థియేటర్ లోని ప్రేక్షకులు అంతా ఢిల్లీలో హృతిక్ రోషన్ సినిమాకు పోతామంటూ వెళ్లిపోతున్నారు. కాని బాహుబలి సినిమా వ్యవహరం కూడా తిరగబడుతోంది. అక్కడి నుంచి కూడా హృతిక్ రోషన్ సినిమాకు లగెత్తుతున్నారు. ఏంటా విషయం అని కనుక్కుంటే.. అది బాహుబలి కాదు.. సాహో సినిమా అవుతుంది.. సర్దుకోండి అని ఢిల్లీ నుంచి సలహాలు ఇస్తున్నారంట.. అందుకే సర్దేసుకుంటున్నారని తెలుస్తోంది.
151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 50 శాతానికి పైనే ఓట్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో పెరిగిన పట్టు.. గ్రామాల్లో అయితే తిరుగే లేదు. అంత బలంగా ఉన్న పార్టీ ఎంపీలు.. బిజెపి వైపు ఎందుకు చూస్తున్నట్లు? టీడీపీ అంటే ఓడిపోయింది.. ఫ్యూచర్ మీద డౌట్స్ ఉన్నాయి కాబట్టి.. ఆ పార్టీ నాయకులు బిజెపి వైపు వెళుతున్నారంటే.. అర్ధం చేసుకోవచ్చు. వైసీపీకి ఏమైంది. బహిరంగసభ నిండుగా జనం.. శాసనసభ నిండుగా ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి చెప్పినట్లు.. ఒక్కసారి అందరూ కలిసి మీదపడితే.. ప్రత్యర్ధి ఔటే. అయినా.. వైసీపీ ఎంపీలు బిజెపి వైపు ఎందుకు వెళుతున్నట్లు? చాలామందికి డౌట్లు వస్తున్నాయి.
వైసీపీ నాయకుల మాటల్లోనే వింటే ‘‘పవన్ కల్యాణ్ బయట మైకు పట్టుకుని రెచ్చిపోతాడు. తాట తీస్తానంటాడు. నాతో పెట్టుకోవద్దంటాడు.. ఇంకేమేమో అంటాడు. కాని మా నాయకుడు లోపల వీటి కంటే పది రెట్లు ఎక్కువే అంటాడు. చెప్పింది చేయకపోతే.. నాకు తెలియకుండా ఏమన్నా చేశారంటే… అన్నీ చూస్తున్నా.. ఇలాంటి డైలాగులకు చివర మరికొంచెం మసాలా కలిపి మరీ వార్నింగులిస్తాడు. అయినా మావాళ్లంతా ఎక్స్ ప్రెషన్ కూడా మార్చకుండా.. తలలూపేస్తారు.. అట్లాంటిది.. బిజెపిలోకి కొందరు ఎంపీలు వెళ్లాలని చూడటం ఏంటీ.. మాకు కూడా అర్ధం కావడం లేదు’’
ఈ కథకు సంబంధించిన టీజర్.. సీబీఐ రిలీజ్ చేసింది. ముహూర్తం షాట్ కు కొబ్బరికాయ కొట్టింది జగన్ అయితే.. సినిమా చూపించింది మాత్రం సీబీఐ. నాకు ప్రతి శుక్రవారం రావడం కుదరదు.. మినహాయింపు ఇవ్వండి అంటూ పిటిషన్ పెట్టాడు. కాని సీబీఐ మాత్రం పేజీలకు పేజీలు సారువారి కథలన్నీ రాసి.. కుదరదని చెప్పమంది. కోర్టు అదే మాట చెప్పింది. ఇప్పుడు సీబీఐ రాసిన పేజీలకు పేజీల కథే అందరినీ కలవరపెడుతోంది. శుక్రవారం రానంటేనే ఇంత కత చేస్తే.. మరి రేపు అసలు కత ఎలా ఉంటుందో అనే గుబులు మొదలైంది.
వైసీపీ ఎంపీలను పక్కకు పిలిచి బిజెపి నేతలు చెవిలో ఇదే విషయం మరింత క్లారిటీగా చెబుతున్నారంట. ముందు బెయిల్ రద్దు.. ఆ తర్వాత శిక్ష పడటం కూడా అంతే ఖాయం అని చెబుతున్నారంట. దీంతో అనేకమంది వైసీపీ నేతలు డైలమాలో పడుతున్నారు. అన్న జైలుకెళితే.. వెనకాలే ఏ2 కూడా వెళ్లక తప్పదు. డైరెక్టర్లు ఇద్దరూ పోతే.. సైడ్ క్యారెక్టర్లు పెత్తనం చేయటం ఖాయం. అప్పుడు అసలు భరించలేం.. అందుకే ముందే సర్దేసుకుంటే పోలా అని కొందరు ఎంపీలు.. బిజెపి చెప్పిన మంత్రానికి చింతకాయలు రాల్చేస్తున్నారని తెలుస్తోంది.
తెలుగు భాష మీద కన్ ఫ్యూజన్ లో ఏదో మాట్లాడని రఘురామరాజును కసురుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి రఘురామరాజును.. మోడీజీ భుజం మీద చేయేసి.. ఏంటి సంగతని అడిగి వెళ్లిపోయారట. ఇదేదో సినిమా సీన్ లా ఉంది కదా. ఇప్పుడు అనుమానాలు మరింత పెరిగిపోయాయి. పైగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుగారు కుండ బద్దలు కొట్టేశారు. ఎంతమంది వస్తారో తెలియదుగాని.. రావటం మాత్రం పక్కా అని చెప్పేశారు. దీంతో మరింతగా అనుమానాలు బలపడ్డాయి. ఏ రోజు ఏం జరుగుతుందో.. ఏ ఎంపీ జెండా ఎత్తేస్తాడోనని విజయసాయిరెడ్డిగారు కాపలా కాయలేక చచ్చిపోతున్నారంట.