టీఆర్ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు.
అక్కడ గంగుల లేకపోవడంతో.. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి అధికారులు వివరాలు సేకరించారు. గురువారం ఢిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి.. మంత్రి గంగులతో టచ్ లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
నకిలీ సీబీఐ శ్రీనివాస్ ఏయే వివరాలు అడిగారనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు అధికారులు. గురువారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు రాకముందే మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లారు.
గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్ కు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం ఈ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు.