ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సీబీఐ మళ్ళీ సమన్లు జారీ చేసింది, ఈ నెల 19 న తమ ప్రధాన కార్యాలయానికి రావాలని కోరినట్టు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఈ కేసులో తానెప్పుడూ సిబిఐ కి సహకరిస్తూనే వచ్చానని, ఇకముందు కూడా సహకరిస్తానని ఆయన అన్నారు. సిసోడియాకు సంబంధించి తాజా ఆధారాలు లభించడంతో ఆయనకు ఈ సంస్థ మళ్ళీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.
లిక్కర్ పాలసీని రూపొందించడంలోను, అమలులోను అవినీతి, అవకతవకలు జరిగినట్టు కొత్తగా ఆధారాలు లభించిన కారణంగా సీబీఐ .. తిరిగి సిసోడియాకు నోటీసులు పంపినట్టు భావిస్తున్నారు. అయితే తనను విచారించేందుకు ఈడీ, సిబిఐలకు పూర్తి అధికారాలు ఉన్నాయని, గతంలో కూడా అధికారులు తన ఇంటిపైన దాడులు నిర్వహించారని, తన బ్యాంక్ లాకర్ తెరిచి చూశారని సిసోడియా పేర్కొన్నారు.
ఢిల్లీ విద్యార్థులకు తాను విద్యాశాఖ మంత్రిగా కూడా మంచి విద్యను అందిస్తున్నానని అందుకే వారు (ఈ దర్యాప్తు సంస్ధలు)_ తనను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా వారి దర్యాప్తునకు సహకరిస్తానన్నారు.
ఢిల్లీ ఎక్సయిజు పాలసీలో ఎన్నో లోపాలు ఉన్నాయని.. తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు, ప్రముఖులకు అనుచితంగా ప్రయోజనం కల్పించారని ఇదివరకే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.