కేంద్ర దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈమధ్యకాలంలో వరుసబెట్టి ఒక దాని తర్వాత ఒకటి దాడులు నిర్వహిస్తున్నాయి. ఓసారి ఈడీ రావడం.. ఇంకోసారి ఐటీ.. ఆ తర్వాత సీబీఐ.. ఇలా వరుసగా సోదాలకు దిగుతున్నాయి. తాజాగా ఐటీ, సీబీఐ సంస్థలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
పాతబస్తీలో ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సదరు సంస్థ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. తాజాగా కంపెనీ కార్యకలాపాలపై దృష్టి సారించిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పాతబస్తీ ఆజంపురాలోని డాక్టర్ అంజుమ్ సుల్తానా ఇంట్లోనూ సీబీఐ తనిఖీలు జరుపుతోంది. ఆమె భర్త ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అధికారులు కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, లావాదేవీల వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
మరోవైపు మంజీరా కెమికల్స్ పై ఐటీ శాఖ రెయిడ్స్ నిర్వహిస్తోంది. 14 టీములతో 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.