ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి తెలంగాణ సీఎస్‌కు సీబీఐ మరోసారి లేఖ రాసింది. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను ఇవ్వాలని లేఖలో సీబీఐ కోరింది. ఇది వరకు సీఎస్ కు సీబీఐ ఐదుసార్లు లేఖ రాసింది.
మొయినా బాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను అందించాలని ఈ నెల 6న రాసిన లేఖలో సీబీఐ కోరింది. హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువడిన అనంతరం సీబీఐకి చెందిన ఢిల్లీ ఎస్పీ సుమన్ కుమార్ లేఖ రాశారు.
ఈ కేసులో సిట్ దర్యాప్తును నిలిపివేస్తు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తు గతేడాది డిసెంబర్ 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పునకు సంబంధించిన ప్రతులు డిసెంబర్ 28న బయటకు వచ్చాయి.
తీర్పునకు సంబంధించిన పత్రాలు సీబీఐ కార్యాలయానికి చేరుకున్న తర్వాత డిసెబంర్ 31వ సీఎస్‌కు సీబీఐ లేఖ రాసింది. మెయినాబాద్ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను హైకోర్టు ఆదేశాల మేరకు తమకు అందించాలని లేఖలో కోరారు.
ఆ తర్వాత గత నెల 5, 9, 11, 26 తేదీల్లో నాలుగు సార్లు సీబీఐ అధికారులు లేఖలు రాశారు. కానీ సీబీఐకి సీఎస్ వివరాలు అందించలేదు. ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తు తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై ఈ నెల 17 విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. మరోవైపు మెయినాబాద్ పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను ప్రభుత్వం అందించడం లేదని హైకోర్టు మెట్లెక్కాలని సీబీఐ ఆలోచిస్తోందని తెలుస్తోంది.