హైదరాబాద్: ‘సొమ్ములు పోనాయండీ.. మనమేటి సేత్తాం..’ అనేది బొత్స సత్యనారాయణ కాపీరైట్ డైలాగ్. ఇప్పుడు ఆ సొమ్ములు పోయిన కేసులోనే బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్టు సమన్లు పంపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్ వ్యాగన్ కేసు వ్యవహారంలో ఏపీ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు వచ్చాయి. హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు మంత్ర సత్యనారాయణకు సమన్లు జారీచేసింది. వచ్చే నెల 12వ తేదీన న్యాయస్థానానికి హాజరుకావాలని ఆదేశించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయంలో బొత్స సత్యనారాయణ పరిశ్రమల శాఖకు మంత్రిగా ఉన్నారు. ఫోక్స్‌వ్యాగన్ కేసులో ఆయనే ముఖ్య సాక్షి.
జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ సంస్థ విశాఖపట్నంలో తమ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పట్లో పలువురు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని అభియోగం. దీనిపై కేసు నమోదయ్యింది. వశిష్ఠ వాహన్ మాజీ అధికారి హెల్మంత్, అశోక్‌కుమార్ జైన్, వశిష్ఠ వాహన్ డైరెక్టర్లు జగదీశ్ అలగ్‌రాజా, గాయిత్రీరాయ్, వీకే చతుర్వేది, జోసఫ్ వీ జార్జ్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 2010లో నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలయిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ వాంగ్మూలం అవసరం పడింది. అందుకే సమన్లు జారీచేశారు. వాంగ్మూలం నమోదుకోసం సెప్టెంబర్ 12న బొత్స సత్యనారాయణ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సివుంది.