మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో నిజానిజాలే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపిన సీబీఐ..తాజాగా మరోసారి విచారణకు సిద్ధమైంది.
వివేక హత్య కేసులో మార్చి 6న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రాలేనని అవినాష్ చెప్పగా..రేపు కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది.
మరో వైపు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సైతం సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఈనెల 12న విచారణకు రావాలని తెలిపిన సీబీఐ అధికారులు..మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6 వ తేదీనే రావాలన్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు రావాలని స్పష్టం చేశారు. తండ్రి,కుమారులు ఇద్దరిని ఆరవ తేదీన విచారించనున్నారు. దీంతో సీబీఐ విచారణపై ఆసక్తి నెలకొంది.