మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ ఒక రోజు ముందుకు, రెండ్రోజులు వెనక్కి అన్నట్టు కొనసాగుతోంది. ఇవాళ తప్పని సరిగా హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసినా… అవినాష్ రెడ్డి ఇవాళ కుదరదని తెలిపారు. దీంతో మరోసారి నోటీసు జారీ చేసిన సీబీఐ.. ఈ నెల 10 న విచారణకు రావాలని పేర్కొన్నారు.
దీంతో 10 వ తేదీన సీబీఐ ఎదుట విచారణకు తాను హాజరు అవుతానని అవినాష్ చెప్పారు. ఇది ఇలా ఉంటే.. సోమవారం రోజున ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యే అంశంపై తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. సోమవారం తప్పనిసరిగా హాజరు కావల్సిందేనని… అధికారులు శనివారం రాత్రి స్పష్టం చేశారు.
అయితే ముందుగా షెడ్యూల్లో ఉన్న పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె, చక్రాయపేట మండల్లాలోని సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో.. వేంపల్లెలో సమావేశం ఉంది. దీంతో ముందుగానే నిర్ణయమైన దాని ప్రకారం ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున.. వివేక హత్య కేసు విచారణకు రాలేనని సీబీఐకి ఎంపీ ఆదివారం లేఖ రాయగా.. ఆ మేరకు సీబీఐ అనుమతించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
దీంతో ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆదివారం రాత్రి పులివెందులలో అవినాష్ ఇంటికి వెళ్లి నోటీసును సీబీఐ అధికారులు అందజేశారు. ఈ నెల 10 వ తేదీన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. అయితే అంతకు ముందు ఈనెల 12 న కడపలో విచారణకు రావాలని 5 రోజుల క్రితమే భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో 10 న అవినాష్ రెడ్డి, 12 న భాస్కర్ రెడ్డిలు సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు.