వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ విచారించడం పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేడు భాస్కర రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. పులివెందులో భాస్కర రెడ్డి ఇంటికి వెళ్లి మరీ సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు.
ఈనెల 12 తేదీన కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ తెలిపింది. గత నెల 23న వ్యక్తిగత కారణాల వల్ల భాస్కర రెడ్డి హాజరు కాలేక పోయారు. వివేకా హత్య కేసులో భాస్కర రెడ్డిని సీబీఐ సూత్రధారిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సూత్రధారుల గుట్టు రట్టు చేసేందుకు సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే అవినాశ్ రెడ్డిని రెండు సార్లు హైదరాబాద్ కు పిలిపించి విచారించింది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా గత నెల 23 న విచారణకు రావాలని నోటీసు జారీ చేసింది. అయితే ఆరోజు కుటుంబ పనులు ఉన్న కారణంగా మరో రోజు వస్తానని రిక్వెస్ట్ చేశారు.
దీంతో గత నెల 26న సెంట్రల్ జైలు అతిథి గృహంలో ఆయన విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి సీబీఐ బృందం సైతం కడపకు చేరుకుంది. అయితే తనకు ఎలాంటి నోటీసులు రాలేదని భాస్కర్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. మరో వైపు అవినాశ్ రెడ్డి సీబీఐ తీరుపై మండిపడుతున్నారు.