లోక్ సభ ఎంపీగా తన కుండే హక్కులను సీబీఐ అధికారులు ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం అన్నారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు.
పార్లమెంట్ సభ్యుడిగా తనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సీబీఐ ఉల్లంఘించిందని స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. సీబీఐ రాజ్యాంగ విరుద్ద చర్యలకు తాను బాధితుడిగా మారినట్టు స్పీకర్ కు తెలిపినట్టు వివరించారు.
సోదాల సమయంలో తనకు సంబంధించిన అత్యంత రహస్యమైన, వ్యక్తిగత నోట్స్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన పత్రాలను అధికారులు సీజ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు.
అసమ్మతి గళాలను అణగదొక్కే లక్ష్యంతో సీబీఐ దర్యాప్తు సాగుతున్నట్టు ఆయన ఆరోపించారు. గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ విష ప్రచారం చేస్తోందని లేఖ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లినట్టు వెల్లడించారు. ఇలా టార్గెట్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పీకర్ కు విన్నవించినట్టు పేర్కొన్నారు.