మాజీ మంత్రి వివేకా హత్య జరిగి ఇన్నాళ్లయినా ఎవరు చేశారో బయటపడలేదు. ఈమధ్య సీబీఐ కాస్త దూకుడుగా విచారణను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడంటూ కంప్లయింట్ ఇచ్చారామె.
అనుమానితుడు ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి.. మణికంఠ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు అతడ్ని విచారిస్తున్నారు.
వివేకా హత్యకేసుకు సంబంధించి శుక్రవారం రఘునాథ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని విచారించారు అధికారులు. రఘునాథ్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగి. అలాగే శివశంకర్ రెడ్డి వైసీపీ రాష్ట్రకార్యదర్శి. వరుసగా సీఎం జగన్ సన్నిహితులు, బంధువులను విచారిస్తుండడం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించారు అధికారులు.