ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈడీ, సీబీఐ దూకుడు ఉధృతమవుతోంది. ఈ కేసులో రామచంద్రన్ పిళ్ళై నుంచి మొదలు పెట్టి.. అభిషేక్ రావు వరకు.. ఇప్పుడు తాజాగా అమిత్ అరోరా వరకు ఇది కోరలు చేస్తోంది. ఓ వైపు హైదరాబాద్ కే చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్టు చేయగా ఇప్పుడు మరొకరిని ఈ సంస్థ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బడ్డీ రీటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎండీ అయిన అమిత్ అరోరాను వీరు బుధవారం ప్రశ్నించారు. ఈ స్కామ్ లో ఈయన ఏ 9 నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇతని ఖాతాల నుంచి హవాలా రూపంలో పెద్ద ఎత్తున క్యాష్ మళ్లింపు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అభిషేక్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ ఈయనను ప్రశిస్తున్నట్టు వెల్లడవుతోంది.
రెండు రోజులక్రితమే అభిషేక్ రావును హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఒకసారి ప్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. సౌత్ లాబీ అనే సంస్థ పేరిట సొమ్ము వసూలు చేసిన అభిషేక్ రావు.. హవాలా రూపంలో దాదాపు రూ. 3.80 కోట్ల వరకు సమీర్ మహేంద్రకు బదిలీ చేశాడట.
తాజాగా అమిత్ అరోరా అకౌంట్ల నుంచి కూడా హవాలా రూపంలో నగదు మళ్లించినట్టు భావిస్తున్నారు. ఇతనికి మరికొందరికి మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు భావిస్తున్నారు. ఎవరెవరికి నిధులు మళ్లించారు.. ఎవరు వీటిని అందుకున్నారని దర్యాప్తు సాగుతోంది. అభిషేక్ కస్టడీ రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. ముందు ముందు మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో నలుగురిని సీబీఐ అరెస్టు చేయవచ్చునన్న ప్రచారం కోరుగా సాగుతోంది.
ఒకటి రెండు రోజుల్లో కొంతమందికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇదివరకే విజయ్ నాయర్ అరెస్టు అయ్యారు .ఢిల్లీ, ముంబై నగరాల్లో కూడా వీరి దందా సాగినట్టు భావిస్తున్నారు. విచారణలో అభిషేక్ సహకరించడం లేదని తెలుస్తోంది. నిజానికి గత నెల 15 నే అమిత్ అరోరా తాలూకు స్టింగ్ వీడియో ఒకటి హల్చల్ చేసింది. కానీ అప్పుడు ఢిల్లీ లోని ఆప్ ప్రభుత్వ అవినీతిపై మాట్లాడిన ఈయన ఇప్పుడు సీబీఐ రాడార్ లోకి రావడం విశేషమంటున్నారు.