జాబ్స్ ఫర్ ల్యాండ్ స్కామ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ అధికారులు మంగళవారం విచారించారు. అయితే దీనిపై ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య మండిపడ్డారు. ఇలా పనిగట్టుకుని వచ్చి వీరు 74 ఏళ్ళ తన తండ్రిని అదేపనిగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది సరికాదని, ఈ వ్యవహారాన్నంతా తాము గుర్తుంచుకుంటామని, సమయం చాలా శక్తిమంతమైనదని ట్వీట్ చేశారు.
‘నా తండ్రికి ఇప్పటికీ ఢిల్లీలోని పవర్ ని కుదిపివేయగల శక్తి ఉంది. . మా సహనాన్నిఇంకా పరీక్షిస్తున్నారు’ అని ఆమె హెచ్చరించారు. గత డిసెంబరులో ఆమె తన కిడ్నీల్లో ఒకదాన్ని తన తండ్రికి డొనేట్ చేశారు. సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో ఈ సర్జరీ జరిగింది. ఆపరేషన్ అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీకి వచ్చి తన మరో కుమార్తె, ఎంపీ మీసా భారతి ఇంటిలో ఉంటున్నారు.
లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవిని, మీసా భారతిని, హేమను కూడా సీబీఐ అధికారులు నిన్న విచారించారు. 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా వ్యవహరించిన లాలూ ప్రసాద్ యాదవ్.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి నుంచి చౌకగా భూములు కొన్నారని, ఈ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి.
అయితే ఇవన్నీ రాజకీయ కక్షతో చేసిన ఆరోపణలని ఆర్జేడీ నేతలు కొట్టి పారేశారు. గత 30 ఏళ్లుగా తాము వీటిని ఎదుర్కొంటున్నామని, తామెక్కడికీ పారిపోలేదని, బీహార్ లో లాలూ అంటే బీజేపీకి భయమని రబ్రీ దేవి ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15 న యాదవ్ లు, ఇతర నిందితులు ఢిల్లీ కోర్టుకు హాజరు కావలసి ఉంది.