రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది.
ఢిల్లీ, బీహార్ లోని దాదాపు 17 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నసమయంలో.. రైల్వే శాఖకు చెందిన పోస్టుల నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐ తాజాగా అభియోగాలు మోపింది.
ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని సీబీఐ ఆరోపిస్తూ.. వారిని నిందితులుగా పేర్కొంది. ఈ పోస్టులకు సంబంధించిన కేసులో రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ.. అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది.
రూ. 139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 73 ఏళ్ల లాలూ గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చారు. దాణా కుంభకోణం కేసులో బెయిల్ పొందిన కొన్ని వారాల వ్యవధిలోనే లాలూ ఇంటిపై సీబీఐ దాడులు చేపట్టింది. ఈ ఘటన దేశ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.