– సీబీఐకి కేసు అప్పగింత తీర్పు కాపీ
– 45 కారణాలు చెప్పిన న్యాయస్థానం
– సీఎం, పోలీసుల అత్యుత్సాహం!
– సిట్ దర్యాప్తుపై నీలినీడలతోనే జీవో రద్దు
– నిందితులకు దర్యాప్తు సంస్థను మార్చుకునే హక్కు
– మీడియాకు వీడియోలు ఇవ్వడంపై ప్రశ్నలు
– రంగంలోకి సీబీఐ.. అప్పీల్ కి రోహిత్ రెడ్డి
క్రైంబ్యూరో, తొలివెలుగు:ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పుతో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. అయితే.. సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.. 98 పేజీల తీర్పును ఇచ్చారు. 45 అంశాలను లేవనెత్తారు. తాజాగా తీర్పు కాపీ బయటకొచ్చింది. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసిన వీడియోలపై అభ్యంతరం తెలిపారు. పోలీసుల వద్ద ఉండాల్సిన ఎవిడెన్స్.. సీఎంకి ఎవరిచ్చారో కీలకంగా మారనుంది.
తీర్పు ఆధారంగా సీబీఐ సీఎంని విచారిస్తారని సమాచారం. మీడియాలో ముందే వచ్చిన కథనాలను తప్పుబట్టిన కోర్టు.. సిట్ దర్యాప్తునకు ఇచ్చినా.. నిందుతుల హక్కు ప్రకారం వారు కోరిన సంస్థలకు అప్పగించవచ్చని గతంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇచ్చిన 26 తీర్పులను జత చేసింది. సిట్ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. జీవోని రద్దు చేసింది. ఎఫ్ఐఆర్ 455/2022 ని సీబీఐకి బదిలీ చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనన్న న్యాయమూర్తి.. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందన్నారు. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని.. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని.. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు.
అప్పీల్ కి రోహిత్ రెడ్డి
ఫిర్యాదుదారుడికి రక్షణ కల్పించే విధంగా సింగిల్ బెంచ్ తీర్పు లేకపోవడంతో… డివిజన్ బెంచ్ కి వెళ్లేందుకు అటు పోలీసులు ఇటు రోహిత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. డివిజన్ బెంచ్ లో తీర్పు వ్యతిరేకంగా వచ్చినా.. సుప్రీంకోర్టు వరకు వెళ్ళేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. సీబీఐకి అప్పగించిన తీర్పుపై స్టే విధించేలా న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు.