ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోన్న కుంభకోణాలకు తోడు ఇప్పుడు మరో భారీ స్కామ్ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. భారీగా నకిలీ మెడికల్ సర్టిఫికేట్ల స్కామ్ బయట పడినట్టు తెలుస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. విదేశాల్లో చదివినట్టుగా.. నకిలీ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్లను కొందరు డాక్టర్లు తీసుకుంటున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలో దిగింది. దేశవ్యాప్తంగా 91 మెడికల్ యూనివర్సిటీలలో సోదాలు నిర్వహిస్తోంది. విదేశాల్లో చదివి భారతదేశానికి తిరిగి వచ్చిన కొందరు డాక్టర్లు మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ల కోసం ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారిలో చాలా మంది నకిలీ సర్టిఫికేట్లను తీసుకుంటున్నారు. వరంగల్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఈ నకిలీ సర్టిఫికేట్ల స్కామ్ జరగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 73 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందారు. పలు స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లతో సర్టిఫికేట్లు పొందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ సునీల్ కుమార్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 21న సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో నిందితులపై 420, 467, 468, 471 సహా పలు సెక్షన్లు నమోదు చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ఇద్దరు ఫారెన్ గ్రాడ్యుయేట్లను సైతం ఎఫ్ఐఆర్ లో చేర్చింది. బీహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ సర్టిఫికేట్ పొందిన వరంగల్ కాజీపేటకు చెందిన గుడిమళ్ల రాకేష్ కుమార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ పొందిన బాగ్ లింగంపల్లికి చెందిన బొమ్మిడి హరికృష్ణ, బీహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి నకిలీ సర్టిఫికేట్ పొందిన వైజాగ్ కు చెందిన గొర్ల వెంకట్ రాజా వంశీ, విజయవాడ కొత్త పేటకు చెందిన మారుపిళ్ల శరత్ బాబును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ.