మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. కొందరిని అరెస్ట్ చేసినా.. అసలు కారకులు ఎవరు అనేది ఇంతవరకూ నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీజులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
అవినాష్ రెడ్డిని ఇవాళ హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని స్పష్టం చేశారు. నోటీసులపై అవినాష్ రెడ్డి వెంటనే స్పందించారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని కాకపోతే.. పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేనని తెలియజేశారు.
విచారణ కోసం మరో తేదీ తెలియజేయాలని కోరారు ఎంపీ. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇటు పులివెందులలో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం అవినాష్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. అవినాష్ ఇచ్చిన లేఖకు సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కడప నుంచి సీబీఐ బృందం పులివెందులకు బయలుదేరింది.