బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసు మరో మలుపు తిరిగింది. షెల్టర్ హోంలో చనిపోయారనుకుంటున్న 35 అమ్మాయిలు బతికే ఉన్నారని సీబీఐ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రెండేళ్ల క్రితం ముజఫర్ పూర్ షెల్టర్ హోం లోని అమ్మాయిలపై సామూహిక లైంగిక దాడి జరిగిందనే విషయం సంచలనంగా రేపింది. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తు చేసిన సీబీఐ…రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్న షెల్టర్ నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్, అతని సహచరులు 11 మంది అమ్మాయిలను చంపేసి ఉండొచ్చని గత ఏడాది సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ మేరకు కొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది.
అయితే తాజాగా బుధవారం ఒక పురుషుడు, ఒక మహిళ అస్థిపంజరాలను మాత్రమే దొరికాయని..అంతకు మించి మైనర్ అమ్మాయిలను హత్య చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ తరపున హాజరైన అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ అమ్మాయిలను హత్య చేశారని ఆరోపణలొచ్చాయని..అయితే ఆ తర్వాత వారు బతికే ఉన్నట్టు సీబీఐ గుర్తించిందన్నారు. సీబీఐ బీహార్ లోని మొత్తం 17 షెల్టర్ హోమ్ లపై దర్యాప్తు చేయగా..వాటిలో 13 షెల్టర్ హోమ్ లపై చార్జీషీట్ వేశామని చెప్పారు. ప్రభుత్వ షెల్టర్ హోమ్ లో అమ్మాయిలతో బలవంతంగా నగ్న నృత్యాలు చేయించడం, మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు ఈ సెక్స్ కుంభకోణంతో సంబంధముందని సీబీఐ వెల్లడించింది. షెల్టర్ హోం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్ పై దారుణ నేరాలను సీబీఐ వెలికితీసింది. షెల్టర్ హోం నిర్వహణలో లోపాలకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టు లో సీబీఐ బీహార్ ప్రభుత్వాన్ని కోరింది.