ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు పంపింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో దర్యాప్తునకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆగస్టు 17న తొలి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా పేరును ఏ1 గా చేర్చారు. తాజాగా ఈ కేసులో ఆయనకు తొలిసారిగా సీబీఐ సమన్లు పంపడం గమనార్హం.
సీబీఐ సమన్లపై సిసోడియా స్పందించారు. తన నివాసంలో సీబీఐ అధికారులు సుమారు పద్నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. తన గ్రామంలో సీబీఐ అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు.
ఇప్పుడు ఆ అధికారులు తనను సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు రావాలని ఆదేశించారని ఆయన తెలిపారు. తాను తప్ప కుండా విచారణకు హాజరవుతానని చెప్పారు. దర్యాప్తు సంస్థకు తన పూర్తి సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. చివరగా సత్యమేవ జయతే అని రాసుకొచ్చారు.