ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్ట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. నోయిడా-ఆగ్రా ను కనెక్ట్ చేసే యమునా ఎక్స్ ప్రెస్ వే కోసం మథురా లో భూమి కొనుగోలులో రూ.126 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలున్నాయి. 165 కిలో మీటర్ల ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్ట్ ను బీఎస్పీ నేత, నాటి ముఖ్యమంత్రి మాయావతి శంకుస్థాపన చేయగా…2012 లో సమాజ్ వాదీ పార్టీ నేత, అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రారంభించారు.
ఎక్స్ ప్రెస్ వే కుంభకోణంపై ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సీబీఐ దర్యాప్తుకు అప్పగించింది.ఎక్స్ ప్రెస్ వే మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పి.సి.గుప్తాతో సహా 19 మందిని నిందితులుగా చేర్చారు. గుప్త తో పాటు కొందరు యమునా ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆథార్టీ అధికారులు, 19 కంపెనీలకు చెందిన ఉద్యోగులు కలిసి 57.15 ఎకరాల భూమిని 85.49 కోట్లకు కొనుగోలు చేశారు. అధిక ధరకు భూమిని కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి 126 కోట్ల నష్టం వచ్చింది. కంపెనీ చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో యమునా ఎక్స్ ప్రెస్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆథార్టీ జేపీ గ్రూప్ కు కేటాయించిన వెయ్యి ఎకరాల భూమిని రద్దు చేసింది.