తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు వ్యతిరేకంగా తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలంటూ సీఆర్సీపీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు.
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు ఇటీవల నోటీసులు ఇచ్చిన తర్వాత మల్లు రవి స్పందిస్తూ.. నోటీసులు ఇస్తే నాకు ఇవ్వాలి.. సునీల్ కి ఇవ్వడం ఏంటి? ఆయనకేం సంబంధం అంటూ ప్రశ్నించారు. వార్ రూమ్ కి తానే ఇన్ చార్జ్ అని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మల్లు రవికి పోలీసులు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో భాగంగా సోమవారం రెండు గంటల పాటు సునీల్ కనుగోలును పోలీసులు విచారించారు. అతని స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. తెలంగాణ గళం పేరుతో ఫేస్ బుక్ లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే సునీల్ కనుగోలు సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. సునీల్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో గత నెలలోనే ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు రియాక్ట్ అవుతూ.. సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.