ఒక కలెక్టర్ బదిలీ పై వెళ్తే టపాసులు కాల్చి పండుగ చేశారు. అదే మరో ఉన్నతాధికారిని బదిలీ చేస్తే మాత్రం వద్దు..వద్దు అంటూ నిరసనలు చేస్తున్నారు. ఈ ఆసక్తికర సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. ఐఏఎస్ ల బదిలీలపై ఆదివాసీలు మిశ్రమంగా స్పందించారు.
ఓ కలెక్టర్ పై ఆగ్రహం వెళ్లగక్కిన వీరు.. మరో కలెక్టర్ పై మాత్రం విపరీతమైన అభిమానం చాటుతున్నారు. పోరాటాల పురిడి గడ్డ.. కొమురం భీం జిల్లాలో నిన్నటి వరకూ కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఐఏఎస్ రాహుల్ రాజ్.. బదిలీపై ఆదిలాబాద్ కు వెళ్లారు. దీంతో కొమురం భీం జిల్లా వాసులు, ఆదివాసీ విద్యార్థులు,కింది స్థాయి ఉద్యోగులు.. సంబురాలు చేసుకున్నారు.
ఇక ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా పని చేసి నిర్మల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు వరుణ్ రెడ్డి. అయితే ఈ ఉన్నతాధికారి బదిలీ మాత్రం వద్దంటున్నారు. వరుణ్ రెడ్డి బదిలీ రద్దు చేసి.. ఆయన్ను ఐటీడీఏ పీవోగానే ఉంచాలని కోరుతున్నారు ఇక్కడి ఆదివాసీలు. వరుణ్ రెడ్డి బదిలీ ఆపాలంటూ డిమాండ్ చేస్తోంది ఆదివాసీ హక్కుల సమితి తుడుందెబ్బ.
అయితే కొమురం భీం జిల్లా కలెక్టర్ గా పని చేసిన రాహుల్ రాజ్ ను ఇక్కడి నుంచి బదిలీ చేసినందుకు సంతోషంగా ఉందంటున్నారీ అడవిబిడ్డలు. ఇన్నాళ్లకు తమ కష్టాలు తీరాయంటూ స్వీట్లు పంచుకొని పండగ చేసుకుంటున్నారు. ఒక కలెక్టర్ బదిలీపై టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకోవడం, మరో ఉన్నతాధికారి బదిలీని మాత్రం వద్దనడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.