నటుడు నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన తారక్ 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. తారకరత్న పార్థివదేహాన్ని మోకిల నుండి హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. సోమవారం ఉదయం 10 గంటల తరువాత ప్రజలు, అభిమానుల సందర్శనార్థం తారక్ భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు.
ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తారకరత్నను కడసారి చూసేందుకు ఫిల్మ్ ఛాంబర్ వద్దకు అభిమానులు చేరుకుంటున్నారు. తారకరత్న భౌతికకాయానికి ప్రముఖ సినీనటుడు వెంకటేశ్, ఆయన సోదరుడు నిర్మాత సురేశ్ బాబు నివాళులర్పించారు. ఫిల్మ్‌ఛాంబర్‌కు వచ్చి అంజలి ఘటించారు. కేంద్రమంత్రి పురందేశ్వరితోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తారకరత్న పార్థివదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంజలి ఘటించారు.
తారకరత్న మృతి చాలా బాధాకరమని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లో నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జూ.ఎన్‌టిఆర్, కల్యాణ్‌రామ్, బాలకృష్ణ, విజయసాయిరెడ్డి, తదితరులు ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చి తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
తారకరత్న ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆకాంక్షించామని తరుణ్ అన్నాడు. సడెన్‌గా ఇలా జరుగడం బాధాకరం. తారకరత్న మరణం ఆయన కుటుంబంతోపాటు నాకు తీరని లోటు. మంచి స్నేహితుడిని కోల్పోయాను. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇద్దరం భారతీయ విద్యాభవన్‌లోనే చదువుకున్నాం. ఎప్పుడూ నవ్వుతూ అందరితో ఎంతో మర్యాదగా, ఫ్రెండ్లీగా ఉంటాడు. వ్యక్తిగతంగా మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలింఛాంబర్‌లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. తారకరత్నకు అభిమానులతోపాటు సినీప్రముఖులు నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర సాగనుంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.