తారకరత్న అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రకాశవంతమైన, ప్రతిభావంతుడైన, ఆప్యాయత గల తారకరత్న.. చాలా త్వరగా వెళ్లిపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. శివైక్యం అని ట్వీట్ చేశారు చిరంజీవి.
ఎంపీ రఘురామ కృష్ణరాజు ట్వీట్ చేశారు. నందమూరి తారకరత్న మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలా త్వరగా వెళ్లిపోయారని.. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులందరికీ సానుభూతి తెలిపారు.
గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న నందమూరి తారకరత్న(ఎన్టీఆర్) కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయానికి ఆయన నివాసానికి తరలిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
1983 ఫిబ్రవరి 22న జన్మించారు తారక రత్న. నందమూరి వారసుడిగా 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి రికార్డులకెక్కారు. ప్రపంచంలో ఏ హీరో తారకరత్నలా ఒకేరోజు 9 సినిమాలను ప్రారంభించలేదు. ఈ అరుదైన రికార్డ్ ఆయనకే సొంతం. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించారు.