ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఏపీ సీఎంవో కార్యాలయం జగన్ సంతాపం తెలిపినట్లు ట్వీట్ చేసింది. అద్భుతమైన గ్రాత్రంతో సంగీత ప్రేక్షకుల్ని వాణీ జయరాం అలరించారని కొనియాడారు జగన్.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె అత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. వాణీ జయరాం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గాయని చిత్ర స్పందిస్తూ.. ‘‘వాణి అమ్మ చనిపోయారని తెలిసి షాక్ కు గురయ్యాను. రెండు రోజుల క్రితమే ఆమెతో మాట్లాడాను. ఆమె బహుముఖ, బహుభాషా గాయకురాలు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని అన్నారు.
వాణీ జయరాం గురించి భయంకరమైన వార్తలు వస్తున్నాయని ట్వీట్ చేశారు నటి కుష్బూ. మనం మరో రత్నాన్ని కోల్పోయామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా మనల్ని ఉర్రూతలూగించిన ఆ స్వరం మూగబోయిందని తెలిపారు. వాణీ జయరాం స్వరం మధురమైన, సున్నితమైనదని కొనియాడారు. ‘‘నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావు అమ్మ’’ అంటూ ట్వీట్ చేశారు కుష్బూ.
నటి రాధిక స్పందిస్తూ.. ఈ వార్త విని షాక్ కు గురయ్యానని చెప్పారు. శుక్రవారం రాత్రి ఆమె పాటలు విన్నానని చెప్పారు. కళాతపస్వి కే విశ్వనాథ్ సినిమాల్లోని పాటలను వింటుండగా.. వాణీ జయరాం గురించి తన భర్తతో మాట్లాడానని వివరించారు రాధిక.