బాసర ట్రిపుల్ ఐటీలో అధికారుల నిర్ణయాలు ఇటీవల వివాదాస్పదంగా మారుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో అకస్మాత్తుగా సెలవులు ప్రకటించడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. తాజాగా వర్సిటీలో ఆంక్షలు విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకు రావడంపై అధికారులు నిషేధం విధించారు. వర్సిటీ పరిపాలన భవనం, తరగతి గదులు, ప్రయోగ శాలలు, అకడమిక్ బ్లాకులలో మొబైల్ ఫోన్ వినియోగించడంపై నిషేధం విధిస్తూ ఇంఛార్జీ వెంకట రమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
దీనిపై విద్యార్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసర ఐఐటీకి రెగ్యులర్ వీసీ నియమించాలని, క్యాంపస్ లోని పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత వారం రోజులుగా ఆందోళన నిర్వహించారు. సమస్యలను పరిష్కరిస్తామని గతంలో అధికారులు హామీ ఇచ్చారని, కానీ అలా జరగలేదన్నారు.
అందువల్ల ఈసారి తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అధికారుల సమక్షంలో విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో 12 డిమాండ్లను మంత్రి ముందు అధికారులు పెట్టారు.
విద్యార్థుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని, రెగ్యులర్ వీసీని త్వరలోనే నియమిస్తామని ఆమె హామి ఇచ్చారు. అయితే ఇటీవల అనూహ్యంగా విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో ఈంఛార్జీ వీసీగా ఫ్రొఫెసర్ వెంకట రమణను ప్రభుత్వం నియమించింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ప్రధాన డిమాండ్ల,ను ఈనెల 24 లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులతో చర్చలు జరిపినా అవి విఫలం అయ్యాయి. అధికారులకు ఇచ్చిన డెడ్ లైన్ శనివారం అర్ధరాత్రితో ముగిసింది.
ఈ3 విద్యార్థులకు అనూహ్యంగా సెమిస్టర్ బ్రేక్ సెలవులు ప్రకటించడం వివాదాస్పదం అయింది. దీంతో విద్యార్థులు న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాలేజీకి సెలవులు ఉండడంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళనలకు బ్రేక్ ఇచ్చారు.. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుతాయో చూడాలి.