– సీఐకి టవర్ లోకేషన్ ఐడెంటిఫికేషన్ ఎలా?
– ఈ విషయంలో కేసు వేస్తే ఇరుక్కునేది ఎవరు?
– కాల్ డేటా కంటే సింపుల్ గా లోకేషన్ చేప్పేస్తున్న టాస్క్ ఫోర్స్
– సెల్ కంపెనీలు, కీచక పోలీసుల అరాచకాలు ఇంకెన్ని?
– కూపీలాగితే న్యాయస్థానాల్లో ఉండేది ఎంతమంది?
– వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం.. ఇదెక్కడి అధికారం?
క్రైం బ్యూరో, తొలివెలుగు:టవర్ లోకేషన్.. ఇప్పుడిది హైదరాబాద్ పోలీసులకు చాలా సింపుల్. ఎవరు ఎక్కడ ఉన్నారో ఇట్లే సెల్ ఫోన్ లో చూసుకుని తమ కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు. సీఐ నాగేశ్వరరావు విషయంలో అదే జరిగింది. బాధితురాలు, భర్త ఫోన్ల లొకేషన్ల ఆధారంగా ఘోరానికి పాల్పడ్డాడు. దీన్నిబట్టి ఉగ్రవాదుల కోసం మాత్రమే వాడాల్సిన ఈ టవర్ లోకేషన్ కాల్ రికార్డ్ వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నట్లు అర్థం అవుతోంది. నిజానికి.. ఫోన్లలో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వినడం నేరం. ఒకప్పుడు నరరూప రాక్షసుడు నయీంకి ఇప్పుడున్న అడిషనల్ ఎస్పీ ఒకరు ప్రత్యేకంగా ప్రత్యర్థుల సెల్ ఫోన్ టవర్ లోకేషన్ పంపించేవారు. దాంతో కిడ్నాప్ లు చేయడం.. బెదిరింపులకు పాల్పడడం ఈజీ అయ్యింది. ఒక దశలో మంత్రులను సైతం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లావో చెప్పాలా.. నా మనుషులు ఉన్నారని బ్లాక్ మెయిల్ చేసేంతగా రెచ్చిపోయాడు నయీం. అయితే.. ఇప్పుడు అత్యాచార కేసులో ఇరుక్కున్న సీఐ నాగేశ్వరరావు లొకేషన్ విషయంలో రూల్స్ అతిక్రమించాడు. అంతేకాదు.. బడాబాబులకు ఎవరి టవర్ లోకేషన్ కావాలంటే వారికి ఇచ్చేవారట. దీంతో మాఫియా పరిచయాలు బలపడి.. భారీగా సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో 5 ఎకరాల భూమి, ఇటీవల 2 కోట్లకు ఎకరం చొప్పున కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం?
సీపీ అంజనీ కుమార్ ఉన్న సమయంలో టాస్క్ ఫోర్స్ సీఐలకు టవర్ లోకేషన్ ఐడెంటి ఫై చేసేందుకు అడిషనల్ డిసిపి, ఓఎస్డీ రాధాకిషన్ రావు ఒత్తిడి మేరకు పర్మిషన్ ఇచ్చేశారు. అయితే.. ఇది గతంలో ఎస్పీ స్థాయి ర్యాంకు అధికారి లెటర్ ఇస్తేనే సెల్ కంపెనీలు ఇచ్చేవి. కానీ.. ఆ పరిధి సీఐ స్థాయికి దిగజారిపోయింది. దీంతో హైదరాబాద్ లో సీఐలు ఈ విషయంలో అత్యుత్సాహం చూపిస్తున్నారు. కేసు నమోదు అయిన తర్వాత నేరస్థుని తీవ్రతను బట్టి ఫోన్ ట్యాపింగ్, లోకేషన్ గుర్తించి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. నిజాయితీగా పోలీసులు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే.. కేంద్ర హోంశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. అందులో కౌంటర్ ఇంటెలిజెన్స్ , సిట్ లాంటి దర్యాప్తు సంస్థల కోరిక మేరకు ఇస్తుంటారు. కానీ.. తెలంగాణలో ఎదైనా సాధ్యమే అన్నట్లుగా విచ్చలవిడిగా కాల్ డేటా, టవర్ లోకేషన్ ఐడెంటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు.
కేసు వేస్తే ఉచ్చు బిగుసుకునే అవకాశం
చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని వదిలివెళ్లడానికి ప్రధానమైన కారణాలలో ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఇప్పుడు కంపెనీలు ఎలాంటి లెటర్స్ లేకుండా విచ్చలవిడిగా టవర్ లోకేషన్ , కాల్ డేటా, కాల్ రికార్డ్స్ ఇచ్చాయో తెలియాలంటే.. సీఐ కేసు ఆధారంగా కేసు ఫైల్ చేస్తే ఐపీఎస్ లు కూడా బయటపడలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దిశ నిందితుల ఎన్ కౌంటర్ అయితే ఎలా స్లోగా విచారణ జరిగిందో.. అలా అందరికీ ఉచ్చు బిగుసుకునే అవకాశాలు లేకపోలేదు.
సీఐ నాగేశ్వరరావుకే ఎందుకంత స్వేచ్ఛ?
ఎనిమిదేళ్లు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన నాగేశ్వరరావు.. ఎన్నో కేసుల్లో ఉన్నతాధికారులకు మేలు జరిగేలా పనిచేశారని తెలుస్తోంది. రాజకీయ నాయకులకు వారి ప్రతినిధులకు ఎప్పుడు ఏది కావాలన్నా అధికార దుర్వినియోగం చేశారని… చివరికి మీడియా ప్రతినిధులకు అన్నీ తానై చూసుకున్న రోజులు ఉన్నాయని సమాచారం. అందుకు నేషనల్, లోకల్ ప్రింట్ మీడియా ప్రతినిధులతో పాటు మెరుగైన సమాజం క్రైం రిపోర్టర్లతో తన వ్యవహారాలు రాయకుండా ఉండేందుకు సన్నిహితంగా ఉండేవారట. అయితే.. టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ ఇన్ స్పెక్టర్ గా ఉన్నా.. వెస్ట్ జోన్ లో ర్యాడిసన్ క్లబ్ పై దాడులు చేసి మాదకద్రవ్యాలు అంటూ హడావుడి చేసి 160 మంది వీఐపీల పుత్రరత్నాలను తీసుకొచ్చి.. 12 మంది వీవీఐపీల బిడ్డలను వదిలేశారు. వారిలో ఓ టీవీ ఛానల్ ఓనర్ కోడలు, విద్యాసంస్థల డైరెక్టర్, ఏపీ తాజా మాజీ డీజీపీ కూతురుతో పాటు పలువురు ఉన్నారు. వీరందరినీ స్టేషన్ కి తీసుకొచ్చాక విడిచిపెట్టారు. వీవీఐపీల పరిచయాలు పెరడగం బంజారాహిల్స్ ఎస్ హెచ్ఓ రావడంతో ఈయన పేట్రేగిపోయారని తెలిసింది. నిజాలు, నిజాయితీ ఎప్పటికైనా బయటపడతాయి కాబట్టి ఇప్పుడు అన్నీ బయటకొస్తున్నాయి. అటు రాజకీయ లింకులు కూడా వెలుగుచూస్తున్నాయి. అయినా.. ఆయన టాస్క్ ఫోర్స్ లో పని చేసిన సిగ్నలింగ్ వ్యవస్థని పోలీస్ బాస్ లు చూసి చూడనట్లు వదిలేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపిగా రిటైర్డ్ అయి ఓఎస్డీగా కొనసాగుతున్న రాధాకిషన్ రావు అండదండలు ఉండటంతో ఎవరూ తన సిగ్నలింగ్ పవర్ ని లాక్కొనే ప్రయత్నం చేయలేదు. సమాజం కోసం పనిచేయాల్సిన టవర్ లోకేషన్ వ్యవస్థని.. తన కామవాంఛ కోసం వాడుకోవడంతో ఇప్పుడు ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది.