వివాదాల్లో చిక్కుకున్న ‘పఠాన్’ చిత్రంలో మార్పులు చేయాల్సిందేనని సెన్సార్ బోర్డు ఆదేశించింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ నటించిన ఈ మూవీలోని ఓ పాటపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాలోని ‘బేషరం రంగ్’ అనే సాంగ్ లో హీరోయిన్ దీపికా పదుకోన్ ధరించిన బికినీ కాషాయ రంగులో ఉందని, ఇది హిందూ మత సెంటిమెంట్లను దెబ్బ తీసేదిగా ఉందని హిందూ సంఘాలు ఇటీవల ఆరోపించాయి.
ఈ పాటలో మార్పులు చేయాలనీ, లేని పక్షంలో ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తామని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు హెచ్చరించారు కూడా. ఈ మూవీని ప్రదర్శించే సినిమా హాళ్లను తగులబెడతామని హిందూ సేన తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది.
చివరకు ఈ వివాదాల నడుమ ఈ సినిమాలో.. ఈ పాటలో మార్పులు చేయాలనీ సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషీ ఆదేశించారు. మా గైడ్ లైన్స్ మేరకు మీ సినిమాలో మార్పులు చేసి.. ఆ వెర్షన్ వెర్షన్ ను సమర్పించాలని సూచించారు. అయితే ఎలాంటి మార్పులు చేయాలన్న విషయానికి సంబంధించి ఆయన వివరాలు తెలియజేయలేదు.
ఈ మూవీ లో సినీ దర్శకుల క్రియేటివిటీకి, ఆడియెన్స్ సెంటిమెంట్లకు మధ్య బ్యాలన్స్ (తులనాత్మకత) అన్నది ఉండాలని జోషీ చెప్పారు. మన భారత సంస్కృతి గొప్పదన్న విషయం మరువరాదని పేర్కొన్నారు. మరి సెన్సార్ బోర్డు సూచననుసరించి ఇందులో మేకర్స్ ఎలాంటి మార్పులు చేస్తారో చూడాల్సి ఉంది.