దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను వాయిదా వేసినట్టు కేంద్రం ప్రకటించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ పార్తాప్ సింగ్ బజ్వా అడిగిను ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఓసారి జనాభా లెక్కల సేకరణను కేంద్రం నిర్వహిస్తుంది. ఆ లెక్కన ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొదటి దశ జనాభా లెక్కల సేకరణ జరగాలి. కానీ మార్చి నుంచే కరోనా విజృంభించడంతో వాయిదా పడినట్టు హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జనగణనను మళ్లీ ఎప్పుడు నిర్వహించే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
దేశవ్యాప్తంగా జనగణనకు దాదా 30 లక్షల మంది అధికారులు అవసరం. వారంతా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భౌతిక దూరం పాటించడం కష్టమయ్యే అవకాశాలుండటంతో.. ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని అధికారులు చెప్తున్నారు.