అగ్నిపథ్ పథకంపై తలెత్తిన ఉద్రిక్తతలపై కేంద్రం అలర్ట్ అయింది. ఆందోళనలు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి విస్తరిస్తున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోట్ పంపింది. ఆందోళన పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అప్రమత్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ అర్చనా వర్మ సంతకం చేసిన లేఖలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, అడ్మినిస్ట్రేటర్ అడ్వైజర్లకు పంపింది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు ప్రధానంగా పలువురు ఒకచోట గుమిగూడటం, ధర్మాలు, ప్రదర్శనలు, మార్చ్‌లు, లూటీలు, ప్రజా ఆస్తుల విధ్వంసం రూపంలో ఉంటాయని పేర్కొన్నారు అర్చన.
భారత్ బంద్, ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఈనెల 20న నిరసలకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సర్క్యులేషన్ లో ఉందని.. ఇదే తరహా నిరసనలు కొద్దికాలం పాటు ఉండే అవకాశాలున్నాయని లేఖలో పేర్కొన్నారు అర్చనా వర్మ. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీలకమైన ప్రాంతాలు, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు/లైన్లు, జాతీయ రహదారులు, కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం అనివార్యమన్నారు.
దేశ వ్యాప్తంగా లేవనెత్తిన ఆందోళనల ద్వారా శాంతిభద్రతలు, ప్రశాంతతకు ఎలాంటి అవాంతరాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు వర్మ. కాగా.. అగ్నిపథ్ నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి నిరసనకారులు.. రైల్వే స్టేషన్లు, లైన్లను టార్గెట్ చేసుకోవడంతో నష్టం కూడా భారీగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.
ఇదిలా ఉంటే.. ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 369 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో 201 ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. 159 లోకల్ ప్యాసింజర్ రైళ్లు ఉన్నట్టు రైల్వే శాఖ వివరించింది. వీటితో పాటు మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేయడంతో.. మొత్తం రద్దయిన రైళ్ల సంఖ్య 371కి చేరింది.
యువత విధ్వంసానికి దిగడం దేశవ్యాప్తంగా 340 రైళ్లను ప్రభావితం చేసింది. 234 రైళ్లను అధికారులు రద్దుచేశారు. వీటిలో 94 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 140 ప్యాసింజర్ రైళ్లు ఉన్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. మరో 95 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు.. ఇంకో 11 రైళ్లను దారి మళ్లించినట్టు వివరించారు. బిహార్, జార్ఖండ్, యూపీలోని కొన్ని ప్రాంతాల పరిధిలోని ఒక్క ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ లోనే 164 రైళ్లు రద్దయ్యాయని తెలిపారు అశ్వినీ వైష్ణవ్.