సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా…? కేసీఆర్ పనులు ఇచ్చిన కంపెనీలపైనే ఈడీ, ఐటీ దాడుల వెనుక మర్మం ఏంటీ? కేసీఆర్ కు అరెస్టుల భయం పట్టుకుందా…? ఇప్పుడివే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా ఓవైపు కేసీఆర్ అరెస్ట్ తప్పదంటూ బీజేపీ హెచ్చరిస్తుంది. అప్పటికే కేసీఆర్ సన్నిహితుల కంపెనీలపై ఐటీ దాడులు మొదలయ్యాయి. ఇవి కేవలం రెగ్యూలర్ గా జరిగేవే అని కంపెనీ చెప్పుకున్నా… ఆ తర్వాత ఆయా కంపెనీల నుండి సబ్ కాంట్రాక్టులు పొందిన కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు మొదలయ్యాయి.
మరోవైపు కేసీఆర్ అప్పటి వరకు చెప్పిన మాటలు పక్కన పెట్టి… యూటర్న్ తీసుకోవటం స్టార్ట్ చేశాడు. అయినా దాడులు ఆగలేదు. ఆ దాడుల్లో సంస్థలన్నీ అవకతవకలకు పాల్పడ్డాయని తేలినట్లు ప్రచారం సాగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా కేసీఆర్ యూటర్న్ తీసుకొని… బీజేపీ అనుకూల స్టాండ్ తీసుకుంటున్నప్పటికీ కూడా దాడులు ఆగటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన సంస్థలతో పాటు ఇప్పుడు మిషన్ భగీరథ పనులు చేసిన కాంట్రాక్టర్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో కేసీఆర్ ను పూర్తిగా ఫిక్స్ చేసే వరకు కేంద్రం విడిచిపెట్టేలా లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
పైగా కొన్ని రోజులు కేసీఆర్ అరెస్టుపై కాస్త సైలెంట్ అయిన బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఇప్పుడు మళ్లీ అరెస్ట్ తప్పదు, జైలుకు పంపుతాం అంటూ కామెంట్ చేస్తుండటం గమనించాల్సిన అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ను ఫిక్స్ చేయటం ఖాయమని… అరెస్ట్ చేస్తారా? సయోధ్యతో ముందుకు వెళ్తారా ? అన్నది అప్పటి పొలిటికల్ ఈక్వేషన్స్ పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.