దేశంలో పెట్రోల్ రేట్ల పెంపుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పెట్రోల్ రేటు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ కు 100రూపాయలు దాటింది. వంట గ్యాస్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కేంద్రం జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న వేళ… ఈ ఎన్నికలు ఎన్టీయే కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. పైగా కేరళ, బెంగాల్ లో కొరకరాని కొయ్యగా మారిన పార్టీలను గద్దె దించటం, తమిళనాడులో అధికారిక కూటమిలో ఉండేలా చూడటం, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు గాలివాటం కాదని అస్సాంలో గెలిచి చూపించాలన్న నిర్ణయంతో ఉన్న బీజేపీకి చమురు ధరల పెరుగుదల మైనస్ గా మారింది.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి ప్రతి ఏటా చమురు, వంట గ్యాస్ లపై 5.5లక్షల కోట్ల పన్ను వసూలు చేస్తున్నాయి. ఇది ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఇలాంటి సమయంలో రేట్లు తగ్గించాలంటే అన్ని ప్రభుత్వాలు అంగీకరించాల్సి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
పెట్రోల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని డిమాండ్ తెరపైకి వస్తుంది. కానీ అలా చేస్తే… కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి యేటా 2.5లక్షల కోట్లు కోల్పోవాల్సి వస్తుందని ఓ అంచనా. దీంతో ఇది అందరికీ ఇబ్బందిగా మారే ప్రమాదం ఉన్నందున… మధ్యే మార్గంగా కేంద్రం-రాష్ట్రం విధించే వ్యాట్ తగ్గించుకోవాలన్న అంశంపై ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే అంశాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకనే చెప్పారు.
అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందునే కేంద్రం నిర్ణయాన్ని సమీక్షించేందుకు ముందుకు వచ్చిందని, కానీ ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపే వంట గ్యాస్, చమురు ధరల పెంపు ఏ ప్రభుత్వానికి మంచిది కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.