జగన్ సర్కార్ తీరుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రాజెక్టుల డీపీఆర్ సరిగ్గా తయారు చేయటం కూడా రాదా… డీపీఆర్ ఎలా తయారు చేయాలో సీడబ్ల్యూసీ రూపొందించిన మార్గదర్శకాలను చదువుకొమ్మంటూ ఘాటుగా విమర్శించింది.
ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటరి నుండి రోజుకు మూడు టీఎంసీల నీటిని శ్రీశైలం నుండి ఎత్తిపోసే ప్రాజెక్టును మొదలుపెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ప్రాజెక్ట్ డీపీఆర్ ను పంపించాలని అపెక్స్ కమిటీలో ఆదేశించారు. దీంతో సర్కార్ పంపిన డీపీఆర్ కాపీలు ఈ నెల 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి చేరాయి.
వీటిని పరిశీలించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు… డీపీఆర్ ఇలా తయారు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇందులో ప్రాథమికంగా ఉండాల్సిన సాంకేతిక- ఆర్థికపరమైన అంశాలు కూడా లేవని ఆక్షేపించారు. డీపీఆర్ ఎలా తయారు చేయాలో సీడబ్ల్యూసీ వెబ్ సైట్ నుండి చూసి… సరైన డీపీఆర్ ను తిరిగి పంపించాలని స్పష్టం చేస్తూ ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శితో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ కు లేఖ రాశారు.