దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 28, 29 తేదీల్లో డ్రై రన్ నిర్వహించనుంది. నాలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద టీకా సన్నాహక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
ఈ డ్రైన్ రన్ అంటే… వ్యాక్సిన్ రిహార్సల్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సహా పంజాబ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. ఈ 4 రాష్ట్రాల నుంచి రెండు జిల్లాల చొప్పున ఎంపిక చేశారు. ఈ డ్రైరన్ సందర్భంగా వ్యాక్సిన్ వేసే సమయంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించాలన్న అంశాలను పరిశీలించనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాలు కరోనా హాట్ స్పాట్స్ కాకుండా జాగ్రత్త పడనున్నారు.
ఈ సెంటర్లకు వ్యాక్సిన్ రవాణా, కోల్డ్ స్టోరేజ్ ల నిర్వహణ, భౌతిక దూరం వంటి అంశాలను ప్రాక్టికల్ గా అంచనా వేయనున్నారు. తొలి విడతలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్ ద్వారా వీరిని ట్రాక్ చేస్తారు. ముందుగా ఆరోగ్య సిబ్బంది, 50 ఏళ్ల పైబడిన వారికి టీకా అందించనున్నారు.
ఏపీలో కృష్ణా జిల్లాలో పోలింగ్ బూత్ ల వారీగా ఎంపిక చేసిన నాలుగు బూతులలో ఈ డ్రైరన్ ప్రక్రియ సాగనుంది.