కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అగ్నిపథ్ స్కీం తీసుకొచ్చింది. అయితే.. దీనిపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు యువకులు. కొన్నిచోట్ల పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్ పై లేవనెత్తిన అత్యంత ముఖ్యమైన ఆందోళనలు, అపోహలకు పరిష్కారం సూచించేలా కేంద్రం స్పందించింది.
ఈ రిక్రూట్ మెంట్ స్కీమ్ ప్రకారం నాలుగేళ్ల కోసం.. తొలి బ్యాచ్ లో 17 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసులోని దాదాపు 45వేల మందిని సైన్యంలో భర్తీ చేసుకోనున్నారు. అయితే.. నాలుగేళ్ల తర్వాత పరిస్థితేంటి? మళ్లీ వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవాలా? అనే సాధారణ సందేహం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. ఇటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. తొలి ఏడాది దీనిద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య మొత్తం సైన్యంలో మూడు శాతం మాత్రమే అని పేర్కొంది కేంద్రం. యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేసింది.
అగ్నివీర్ గా సేవలందించిన తర్వాత పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ సౌకర్యం లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే.. చదువుకోవాలనుకునే వారికి 12వ తరగతికి సమానమైన సర్టిఫికేట్, బ్రిడ్జింగ్ కోర్సులో చేరే అవకాశం ఉంటుందని వివరించారు. వేతనంలో కూడిన ఉద్యోగాలు కోరుకునే వారికి సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్, రాష్ట్ర పోలీస్ ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పింది. ఇతర రంగాలలో వారికి అనేక మార్గాలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది.