కేంద్రాన్ని వెంటాడతానని తీవ్రమైన ఆరోపణలు చేసిన కేసీఆర్ కు ఢిల్లీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ వచ్చాయి. వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యుత్ శాఖ స్పందించింది. దీటైన జవాబు ఇచ్చింది.
వ్యవసాయ మోటర్లకు మీటర్ల ఒత్తిడి అంతా తప్పుడు ప్రచారం అని తేల్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేసింది. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలని తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ ను కొనాలని ఒత్తిడి చేయడం లేదని వివరించింది. ముఖ్యంగా పలానా వారి దగ్గరే విద్యుత్ ను కొనాలని తాము చెప్పలేదని స్పష్టం చేసింది కేంద్రం. ఎవరి నుంచైనా కొనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని చెప్పింది.
ఇక హైడ్రో పవర్ గురించి కూడా కేసీఆర్ మాట్లాడారని.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రూ.55వేల కోట్ల అప్పు ఇచ్చాయని గుర్తు చేసింది. దీనికి కేసీఆర్ రుణపడి ఉండాలన్న కేంద్రం.. సీఎం పదవిలో ఉండి అబద్దాలు చెబుతున్నారని మండిపడింది.
ఆదివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్… కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు తెలంగాణలో అమలు చేసే ప్రసక్తేలేదని అన్నారు. ప్రాణం పోయినా సరే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టబోమని చెప్పారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే వడ్లు కొనబోం.. సబ్సిడీలు ఇవ్వబోమని కేంద్రం ఆంక్షలు పెడుతోందంటూ మండిపడ్డారు.