ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించిన దేశాల్లో భారత్ ఒకటి కాగా, అందులో హైదరాబాద్ కూడా ఉంది. భారత్ బయోటెకక్-ఐసీఎంఆర్ సంయుక్తంగా తయారు చేసిన కోవాక్జిన్ హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో తెలంగాణకు కేంద్రం నుండి కేటాయించే వ్యాక్సిన్ కోటాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది.
కేంద్రం నుండి మొదటి విడతగా తెలంగాణకు దాదాపు 60లక్షల డోసుల వరకు వస్తాయని అంచనా ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రొత్సహాకాలు ఇచ్చి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సహాయపడినందున… తమ రాష్ట్రానికి ఎక్కువ డోసులు కావాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అయితే, కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు. వచ్చే అవకాశం కూడా లేనట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థల వద్ద లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది. ఇప్పటికే ఎంత స్టాక్ అందుబాటులో ఉంటాయన్న అంశాన్ని కంపెనీలు కేంద్రానికి అధికారికంగా సమాచారం ఇవ్వగా… దాన్ని బట్టే కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగానే పంపిణీ చేసేందుకు రాష్ట్రాల వారీగా జాబితా సిద్ధం అయ్యింది. దీంతో ఇప్పుడు కోరారని ఎక్కువ డోసులు కేటాయించే అవకాశం లేదు. పైగా కోవాక్జిన్ తో పోల్చితే కోవిషీల్డ్ ఎక్కువగా అందుబాటులో ఉంది. దీంతో తెలంగాణ విజ్ఞప్తి మేరకు అధిక వ్యాక్సిన్ డోసులు కేటాయించే అవకాశం కనపడటం లేదు. పైగా ఆయా రాష్ట్రాల్లోని కరోనా వారియర్స్ ఎంత మంది ఉన్నారు, ఎన్ని డోసులు అవసరం పడతాయి, ఎన్ని డోసులు అందుబాటులో ఉన్నాయన్న లెక్కలు ఇప్పటికే పూర్తయ్యాయంటున్నారు అధికారులు.