కేంద్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ లపై వివక్ష చూపుతుందని..రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన అసమానతలను పెంచేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు. దళిత మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం కావాలన్నారు.
కులాలు,మతాల మద్య బేజేపీ చిచ్చు పెడుతుందని విమర్శించారు. ఆహారపు అలవాట్లను కూడా నియంత్రణ చేస్తున్నారని ఆరోపించారు. 1961 నుంచి 2021 వరకు అరవై ఏళ్లలో ఎస్సీ,ఎస్టీల రిజర్వేషన్లు కేంద్రం పెంచలేదన్నారు. దేశ జనాభాలో ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారని.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో అంబేద్కర్ ఇచ్చిన దళితుల హక్కులను కాలరాయొద్దని కోరారు. ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.60 ఏళ్ళుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచకపోవడం పై ఆర్ ఎస్ ఎస్ కుట్ర ఉందని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపు పై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. యాభై శాతం కంటే ఎక్కువైనా ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వేషన్లు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని ఎంపీ పసునూరి దయాకర్ మండిపడ్డారు. బండి సంజయ్ మసీదులను కూలగొట్టాలంటున్నాడు.. అతనికి బుద్దుందా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు దేశ యువతను వక్రమార్గంలో తీసుకెళుతున్నారని ఆయన విమర్శించారు.