ప్రజల జీవితాలను గాలికి వదిలేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలతోటి కాలక్షేపం చేస్తున్నాయని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య దేశ ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం కోత పెట్టడం సిగ్గుచేటుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్చలకు రావడంలేదని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం 55 రోజులు ఆలస్యం చేసి రైతులకు నష్టం కలిగించిదని ఆరోపించారు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం కనీసం అడిగే సాహసం కూడా చేయలేదని పొన్నాల మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో 75 రూపాయలు ఉన్న పెన్షన్ ను.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 చేసిందని పొన్నాల గుర్తుచేశారు. అప్పుడు నలబై ఆరువేల బడ్జెట్ ఉంటే.. ఇప్పుడు రెండున్నర లక్షలు ఉందన్నారు. కొత్త పెన్షన్ లు దేవుడెరుగు ఉన్న పెన్షన్లు తీసేస్తూ ప్రజలను ఇబ్బుందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ కు దోపిడి తప్ప మరొకటి తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు పొన్నాల. సోలార్ పవర్ తోటి 4,900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కృషిచేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదుల మీద ఇప్పుడు 24 గంటల కరెంటు అందుతోందని అన్నారు. నీటి పారుదల విషయంలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ చర్చకు ఎందుకు రావడంలేదని నిలదీశారు పొన్నాల.