బీజేపీ కండువా కప్పుకోని వారికి మోడీ ప్రభుత్వం నుంచి వేధింపులు తప్పవని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఒక్క మంచి పని చేయలేదన్నారు. పైగా తొమ్మిది ప్రభుత్వాలను కూచ్చి వేశాడని ఆరోపించారు. ఈశాన్యంలో ఒక రాష్ట్రంలో గెలిచినప్పటికీ రెండు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకున్నారని చెప్పారు.
దేశం ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. దేశంలో కేవలం 9 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ అధికారంలో వుందని ఆయన వెల్లడించారు. కానీ దేశం మొత్తంలో బీజేపీ అధికారంలో ఉన్నట్లు అపోహలు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. తమను వ్యతిరేకిస్తున్న పార్టీల ప్రభుత్వాలను రాజ్యంగ బద్ద సంస్థలను ఉపయోగించి కూల్చి వేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
హిట్లర్ లాంటి నియంత కూడా తన జాతి విస్తరణ కోసం ఇతర దేశాలపై దండయాత్ర చేశారన్నారు. అంతే కానీ దేశంలోనే ఇతరులపై ఆయన దాడి చేయలేదన్నారు. కానీ బీజేపీ మాత్రం అందుకు భిన్నంగా కులమతాలను రెచ్చగొడుతూ నయా హిట్లర్ లాగా దాడులు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతోందన్నారు. ఆప్ సర్కార్‌ను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కుంభకోణాల మాస్టర్స్, అవినీతిపరులైన మోడీ స్నేహితులు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆదానీలపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను రాజ్యాంగ సంస్థలను వినియోగించి లొంగ దీసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కొడుకు, కోడలు, కూతురిని కేసుల్లో మోడీ ఇరికిస్తున్నారని వెల్లడించారు.
బీఆర్ఎస్, ఆప్ ప్రభుత్వాలను కూల్చివేసేందుకు మోడీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికిన వారిపై విచారణ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థ లైన బొగ్గు బావులను, ఎల్ఐసీ, ఉక్కు పరిశ్రమలు, రైల్వేలను అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వల్ల ఒక్క మంచి పని కూడా దేశానికి జరగలేదన్నారు.