ఈశాన్య రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం వివాదాస్పదంగానే ఉంది. ఈ చట్టం ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చు రేపిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడ ప్రజలు ఎప్పటి నుంచో ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసోం, మణిపూర్, నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కుదిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) పేరుతో ఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటుదారుల అణిచివేత కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
అలాగే, భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కాగా ప్రత్యేక చట్టం పరిధిని కుదిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు, తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న అనేక ఒప్పందాలు, నిరంతర ప్రయత్నాల కారణంగా ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధిలోని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని అమిత్ షా అన్నారు.
“దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ తరుణంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, చొరబాట్లకు ముగింపు పలికేందుకు పీఎం మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతోంది. వాటి ఫలితమే ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధిలోని ప్రాంతాల కుదింపు.” అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.