ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశాన్ని నివ్వెర పోయేలా చేశాయి. లోక్ సభలో ఉల్లి ధరల పెరుగులపై ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలె మాట్లాడుతూ… మనం బియ్యం, పాలు ఎగుమతి చేస్తున్నామని..అలాంటిది ఉల్లిని ఎందుకు ఎక్కువ ఉత్పత్తి చేయలేకపోతున్నాము?…ఉల్లి ఉత్పత్తి ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయింది? అని ప్రశ్నించారు. ఉల్లి రైతు చాలా చిన్న రైతు అని..వారిని కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రియా సూలె ప్రభుత్వాన్ని కోరారు. సుప్రియా ప్రశ్నలకు ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ సమాధానమిస్తూ … ” నేను ఉల్లిపాయలు…వెల్లుల్లి ఎక్కువ తినను… కాబట్టి నాకు ఆ సమస్య లేదు” అన్నారు. అంతేకాదు ” నేను ఉల్లి, వెల్లుల్లి తక్కువగా తినే కుటుంబం నుంచి వచ్చాను” అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. సభ అంతా అరుపులు వినిపించాయి. ఆ తర్వాత వెంటనే ఉల్లి నిల్వకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని మంత్రి చెప్పారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ”సే ఇట్ లైక్ నిర్మలా తాయ్” యాష్ ట్యాగ్ తో వైరల్ గా మారాయి.