2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌కు ప్రభుత్వం కసరత్తు మొదలుపెడుతోంది. రేపటి నుంచి బడ్జెట్‌కు ముందు సాగే సంప్రదింపులు మొదలుకానున్నాయి. ఢిల్లీ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ వర్గాలను, గ్రూపులతో భేటీ అవుతారు. అయితే కరోనా దృష్ట్యా ఈ సమావేశాలు వర్చువల్ రూపంలో జరుగుతాయి.
కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభకు సమర్పిస్తారు. అయితే బడ్జెట్ రూపకల్పనకు ముందే కేంద్రం వివిధ వర్గాలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ ప్రక్రియను ఆర్థిక శాఖ సంప్రదాయంగా పాటిస్తోంది. పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక నిపుణులు, రైతుల సంఘాలతో పాటు ఇతర ముఖ్యమైన వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశమవుతారు. బడ్జెట్‌పై వారి అభిప్రాయాలను,సలహాలను తీసుకుంటారు. వారి ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలను ఆ తర్వాత ప్రధానికి ఆర్థిక శాఖ అధికారులు వివరిస్తారు.