– మూడోసారి కవిత ఈడీ విచారణ
– ఫోన్ల చుట్టూనే ప్రశ్నలు
– అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు
– ఎక్కడికక్కడే సెక్యూరిటీ పెంపు
– ఏం జరుగుతుందో అనే టెన్షన్ లో బీఆర్ఎస్ శ్రేణులు
క్రైంబ్యూరో, తొలివెలుగు:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ వ్యవహారం టెన్షన్ కొనసాగిస్తూనే ఉంది. కవితను అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నా సరైన స్పష్టత రావడం లేదు. గత రెండుసార్లు విచారణకు భిన్నంగా మంగళవారం పోలీసు బలగాలు మోహరించాయి. ఈడీ ఆఫీస్ ముందు పారా మిలిటరీ ఫోర్స్ కూడా దిగిపోయింది. తెలంగాణలో అల్లర్లు సృష్టిస్తారని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టు ఇవ్వడంతో సెక్యూరిటీ పెంచారు. బీజేపీ ఆఫీస్ కి రాష్ట్ర పోలీసుల భద్రతపై అనుమానాలు రావడంతో.. ప్రైవేట్ సెక్యూరిటీని పెంచుకున్నారు. కవిత అరెస్ట్ పై స్పష్టత వస్తే ఆందోళనలు చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఫోన్స్ ఇవ్వడంతో ఇరుకున ఈడీ!
లిక్కర్ కేసులో ఫోన్స్ వ్యవహారం ప్రధాన టాపిక్ గా మారింది. ఫోన్స్ ని ధ్వంసం చేశారని సీబీఐ, ఈడీ వారి చార్జీషీట్లలో తెలిపారు. అయితే.. అవి పగలగొట్టలేదని తనకే ఫోన్స్ మార్చడం ఇష్టమనే విధంగా అన్నింటినీ ఈడీకి ఇచ్చారు కవిత. దీంతో సరిగ్గా సమాచారం రాబట్టకుండానే చార్జిషీట్లలో పగుల గొట్టారని చెప్పడం విచారణ సరిగ్గా జరగడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. 36 మంది సాక్షులు 170 సెల్ ఫోన్స్ మార్చారని ఇందులో కొన్నింటిని ధ్వంసం చేశారని తెలిపారు అధికారులు. కవిత 2 నెంబర్స్ తో 10 ఫోన్స్ మార్చారని తెలిపారు. మొదటి విచారణలోనే అప్పటి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. మంగళవారం 9 ఫోన్స్ మీడియాకు చూపించి లోపలికి వెళ్లారు కవిత. అయితే.. ఒకే రోజున గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్ వారి సెల్ ఫోన్స్ ఐ ఫోన్ 14 ప్రో ఫోన్స్ తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ 1న ఇది జరిగింది. అదే విధంగా పిళ్లై నాలుగు రోజుల ముందు మార్చుకున్నారు. ఇలా మార్చడం నేరమేమీ కాకపోయినా.. అందులో డేటాను ధ్వంసం చేసినట్లు ఈడీ చెబుతోంది. కేసు విచారణ చేపడుతున్న సమయంలో ఫోన్స్ మార్పు చేయడంతో దీనిపై ఎక్కువ ఫోకస్ చేసింది ఈడీ. అయితే.. వాట్సాప్, ఫేస్ టైం, కాల్ డేటా ను ఇట్లే తీసుకునే ఈడీ.. ఆ ప్రకారంగా విచారణ చేయవచ్చు. కానీ, కేసుకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. సమాచారం అంతా కావాలని కోరుతోంది. దీంతో కవిత కూడా కేసు విచారణకు ఏం కావాలో అది ఇస్తానని మరెలాంటి సంబంధం లేని సమాచారం ఇచ్చేందుకు సహకరించడం లేదని తెలుస్తోంది. తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నందున ఎంతో మందితో ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఉంటాయని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈడీ మాత్రం ఈ కేసుతో అన్ని అర్థిక లావాదేవీలను వారికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణకు సహకరించకుంటే.. అరెస్ట్?
ఫోన్స్ ఇవ్వడంతో వాటిలో ఎలాంటి సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారనేది పరిశీలిస్తున్నారు. కేసును తప్పుదారి పట్టించేలా ఏమన్నా వ్యవహరిస్తే.. ఆధారాలు సేకరించి, అరెస్ట్ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.