సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గంతలోనే సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా సంతకం చేయడంతో సుప్రీంకు కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అధికారికంగా పూర్తైంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా..
1. రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ పంకజ్ మిట్టల్
2. పట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్
3. పట్నా హైకోర్టు జస్టిస్ అమానుల్లా
4. మణిపూర్ హైకోర్టు సీజే సంజయ్ కుమార్
5. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రా
కాగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా.. కొత్తగా నియమితులైన వారితో కలిపి జడ్జిల సంఖ్య 32కు చేరింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసులను కేంద్రం చాలా రోజులుగా పెండింగ్ లో పెట్టింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. ఈ విషయాన్ని విచారించిన జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి హాజరై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు.
ఐదుగురు న్యాయమూర్తులను అతి త్వరలో నియమిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇది చాలా సీరియస్ అంశమని, కేంద్రం కాలయాపన చేయడం సరికాదని తెలిపింది. న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించే పని చేయరాదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులను నియమించింది.