ఏపీకి కేంద్రం మరో శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖలోని పాడేరు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.
ఒక్కో మెడికల్ కాలేజ్ కు కేంద్రం 325కోట్ల చొప్పున… మూడు వైద్య కళాశాలలకు మొత్తంగా 975 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇందులో కేంద్రం 60శాతం భరిస్తుండగా.. 40శాతం రాష్ట్రం భరించనుంది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయి. గతంలోనే ఏపీ సర్కార్ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలను కేటాయించాలని నిర్ణయించింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువుదీరాక కేంద్రంతో సన్నిహితంగానే ఉంటూ వస్తోంది. అలాగే బీజేపీ కూడా తన సహాయాన్నిఏపీకి అందిస్తోంది. కొన్ని దీర్ఘకాలిక అంశాల దృష్ట్యా ముందుచూపుతో జగన్ కేంద్రంతో స్నేహంగా మెలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్ళినపుడుల్లా ఆయన బీజేపీ అగ్రనేతలను,కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలంటూ కోరుతున్నారు. జగన్ అభ్యర్థన మేరకు కేంద్రం కూడా ఏపీ విషయంలో కాస్తా సానుకూలంగానే వ్యవహరిస్తోంది.
ఇటీవల సీఎం జగన్ విభజన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలో కేంద్రం ఏపీకి మూడు మెడికల్ కాలేజీలను మంజారు చేసింది.