దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్న రెక్కాడితే గానీ డొక్కాడని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద రూ. కోటి 70 వేల లక్షల కోట్లను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రోజు వారీ కూలీ చేసుకునే పేదలు, వలస కూలీలకు ఈ పథకం ఉపయోగపడనుంది.
కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుండి సేవ చేస్తోన్న డాక్టర్లు, ఇతర సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూ 50 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ ను కూడా మంత్రి ప్రటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ రంగాల ప్రజలు, పారిశ్రామిక రంగాలకు జరగుతోన్న నష్టాన్ని అంచనా వేసి వారిని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కు మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తున్నారు. మహిళలు,పెన్షనర్లు, దివ్యాంగులతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఎనిమిది విభాగాలు విభజించి నష్టాలను అంచనా వేస్తున్నారు.
ఆహార భద్రతా పథకం కింద నమోదైన పేదలకు మూడు నెలల వరకు 5 కిలోల బియ్యం, గోదుమలు, ఒక కిలో పప్పు ధాన్యాలను ఉచితంగా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రైతులకు ప్రతి ఏటా ఇచ్చే రూ. 6000 లను విడుదల చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. జన్ థన్ ఖాతాదారులు నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం మూడు నెలలు ఎక్స్ గ్రేషియా అందించనుంది. దీనివల్ల 20 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నట్టు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతేగాకుండా మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇచ్చే వేతనాన్ని 182 రూపాలయ నుంచి 202 రూపాలయకు పెంచింది. ఇది 5 కోట్ల మంది కూలీలకు వర్తిస్తుంది.8కోట్ల ఉజ్వల లబ్ధి దారులకు మూడు నెలలు ఉచితంగా గ్యాస్ అందిచనుంది. లాక్ డౌన్ వల్ల ఎవరూ ఆకలితో అలమటించొద్దు అని నిర్మలా సీతారామన్ అన్నారు.