విదేశీ నిధులు అందుకుంటూ నిబంధనలు పాటించని స్వచ్ఛంద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 168 సంస్థలను నిషేధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిషేధానికి గురైన వాటిలో ఫారిన్ కంట్రీబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన చర్చీలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. నిషేధిత సంస్థల జాబితాలో హైదరాబాద్, సికింద్రాబాద్ లోని సేవా భారతి, ఆర్చ్ డయోస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్, యునైటెడ్ గ్రేస్ మినిస్ట్రీస్, సెయింట్ పౌల్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, షమ్మా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, రుద్రమా దేవీ మహిళా మండలి,ధ్యాన ఆశ్రమ్, అమ్మానాన్న అనాధ ఆశ్రమం, ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్, బంజారా ట్రైబల్ ఇన్సియేటివ్, ఏపీ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీ, రాయపాటి ఛారిటేబుల్ అసోషియేషన్, వైఎస్ విజయమ్మ ఛారిటేబుల్ ట్రస్ట్, ఫిలడెల్ఫియా సియోన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి ఉన్నాయి. విదేశీ సంస్థల నుంచి అందుకున్న నిధులు, వాటి ఖర్చులను తెలియజేస్తూ ప్రతి ఏటా ఇన్ కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలి. అయితే ఈ సంస్థలు రిటర్న్స్ సమర్పించకపోవడంతో వాటిని నిషేధించినట్టు ప్రభుత్వం తెలిపింది. తాము రెండేళ్లుగా ఎలాంటి విదేశీ నిధులు అందుకోకపోవడంతో రిటర్న్స్ దాఖలు చేయలేదని…దాని కారణంగానే తమ సంస్థను నిషేధించినట్టు తెలిపారు. ఇప్పుడు రిటర్న్స్ దాఖలు చేస్తామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులు పొందకుండా ఎఫ్‌సీఆర్ఏ యాక్ట్ ను సవరించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రెటరీ పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.