చంద్రబాబు అనగానే ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉండే బ్లాక్ కమాండోస్ గుర్తొస్తారు. ఎన్నో ఏళ్లుగా ఎన్.ఎస్.జీ బ్లాక్ కమాండోస్ చంద్రబాబుకు రక్షణ కల్పిస్తున్నారు. దేశంలోని ప్రముఖుల రక్షణకు వీరిని ఉపయోగించటం కామన్. చంద్రబాబు సహా దేశంలో 13మందికి ఎన్.ఎస్.జీ భద్రత కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే… కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎన్.ఎస్.జీ కమాండోస్ భద్రత ఉపసంహరించబోతున్నారు.
ఎన్.ఎస్.జీ ఇక నుండి కౌంటర్ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్ వంటి ప్రధాన విధులకే పరిమితం చేయాలని… కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్.ఎస్.జీ భద్రత ఉన్నవారికి వారి స్థానంలో పారా మిలిటరీ దళాలతో భద్రతను కల్పించబోతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు సహా అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాయవతి, ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఎన్.ఎస్.జీ భద్రత ఉంది. ఒక్కోక్కరికి ఇరవై నాలుగు గంటలు 25మంది బ్లాక్ క్యాట్ కమాండోస్ కాపాలాగా ఉంటున్నారు. అంటే ఈ విధుల నుండి తప్పించటం ద్వారా 450మంది ఎన్‌ఎస్‌జీ కమాండోలు అందుబాటులోకి వస్తారని… అత్యవసర సమయాల్లో వీరు ఎంతో ఉపయోగపడతారని కేంద్రం భావిస్తోంది. 1984లో యాంటీ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్ ఆపరేషన్ల కోసం ఈ బ్లాక్ క్యాట్ కామాండోస్ వ్యవస్థను తీసుకొచ్చినా… ప్రముఖుల భద్రకు కూడా వీరినే ఉపయోగిస్తున్నారు.